కాంగ్రెస్‌లో కలవరం | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 24 2018 3:09 AM

Trouble for Congress in Telangana with Danam Nagender Quits   - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ ఎన్నికల తరుణంలో అధికార టీఆర్‌ఎస్‌ మళ్లీ మొదలుపెట్టిన ‘ఆకర్‌‡్ష’ వ్యూహానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. ఎన్నికల తరుణంలో ఇతర పార్టీల నుంచి నేతలు రావాల్సి ఉండగా దీనికి భిన్నంగా జరుగుతుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలక నేత దానం నాగేందర్‌ రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. దానం దారిలోనే మరికొందరు ముఖ్య నేతలు పయనిస్తున్నారనే ప్రచారం తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) పెద్దలను ఆత్మరక్షణలో పడేసింది. కాంగ్రెస్‌లో సమన్వయం లేదని, చొరవ తీసుకుని పార్టీని ఏకతాటిన పెట్టాలని రాష్ట్రంలోని పలువురు ముఖ్య నేతలు నాలుగు రోజుల క్రితమే ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీని కలసి విన్నవించారు. అయితే ఆ వెంటనే దానం నాగేందర్‌ పరిణామం జరగడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. పార్టీ నుంచి ముఖ్య నేతల వలసల ఆందోళన పెరగడంతో దిద్దుబాటు చర్యలపై టీపీసీసీ పెద్దలు కసరత్తు ప్రారంభించారు. అసంతృప్త నేతలకు సర్దిచెప్పే వ్యూహాలకు పదునుపెట్టారు. ఇలాంటి వారి వద్దకు ఇతర నేతలను పంపించి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానం నాగేందర్‌ రాజీనామా, మరికొందరు నేతలు ఇదే దారిలో వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి, తాజా పరిణామాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించారు. మొత్తంగా కాంగ్రెస్‌లో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతున్నాయి.

ఊహించిందే అయినా...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలక నేతగా గుర్తింపు పొందన మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ను వీడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ ప్రచారం తాజాగా వాస్తవరూపం దాల్చింది. అయితే ఇది జరిగిన తీరు కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందులకు గురిచేసిందనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడేందుకు దానం చెప్పిన కారణాలు, ఉత్తమ్‌ స్వయంగా ఇంటికి వెళ్లినా దానం కలకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఒక సామాజికవర్గం లాబీయింగ్‌ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ కారణంతోనే కేకే, డీఎస్‌ లాంటి నేతలు పార్టీని వీడారంటూ దానం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కలవరానికి గురి చేస్తున్నాయి. ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువైందనే అంచనా నేపథ్యంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా పార్టీ కమిటీల కూర్పు చేయాలని కసరత్తు ప్రారంభించారు. అయితే ఆ కసరత్తు మొదలై ఆరు నెలలైనా కొలిక్కి రాకపోవడం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న ఆయా వర్గాల నేతలకు అసంతృప్తి కలిగించింది. పార్టీలో ఒకవైపు పదవులు, ప్రాధాన్యత లేకపోవడం, మరోవైపు టీఆర్‌ఎస్‌ ‘ఆకర్ష’ వ్యూహం అమలు చేస్తుండటంతో ఎక్కువ మంది కాంగ్రెస్‌ నేతలు ఊగిసలాటలో పడ్డారు. దానం నిర్ణయం ఈ కోణంలోనే జరిగిందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.

అదే బాటలో మరికొందరు..
దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ను వీడిన తరహాలోనే మరికొందరు నేతలు అదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ మొదలైంది. హైదరాబాద్, మెదక్‌ జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, హైదరాబాద్‌ నగరానికి చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ముఖేశ్‌గౌడ్, కూన శ్రీశైలంగౌడ్, లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో సంతృప్తిగా లేరని, వారికి టీఆర్‌ఎస్‌ గాలం వేసిందనే చర్చ గాంధీ భవన్‌లో రెండు రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ పెద్దలు పార్టీ దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించారు. టీపీసీసీ ముఖ్య నేతలు శుక్రవారం రాత్రి సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారుతున్న సమయంలో ఈ పరిణామాలు పార్టీపై ప్రజల్లో మరో విధమైన అంచనాను కలిగిస్తాయనే అభిప్రాయానికి వచ్చారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన అభిషేక్‌రెడ్డి వద్దకు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెళ్లారు. అయితే తాను కాంగ్రెస్‌ను వీడనని అభిషేక్‌రెడ్డి చెప్పారు. కానీ మిగిలిన నేతలతో సంప్రదింపులకు టీపీసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నా వారిలో ఎందరు సర్దుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఛలో ఢిల్లీ...
పార్టీలోని తాజా పరిణామాలపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ శనివారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు అశోక్‌ గెహ్లాట్, జైరాం రమేశ్, కాంగ్రెస తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియాతోపాటు కొత్తగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులతో దాదాపు ఐదుగంటలపాటు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు కార్యదర్శులకు మూడు జోన్ల బాధ్యతలు అప్పగించారు. దక్షిణ, ఉత్తర, మధ్య తెలంగాణగా విభజించి ముగ్గురు కార్యదర్శులకు బాధ్యతలిచ్చారు. దీనికితోడు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మేనిఫెస్టో, స్క్రీనింగ్, ప్రచార, కో ఆర్డినేషన్‌ కమిటీల కూర్పుపైనా ఏఐసీసీ పెద్దలతో ఉత్తమ్‌ చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని, పార్టీ కమిటీల ప్రకటన వచ్చే అవకాశముందని, మరికొందరు నేతలు జారిపోకుండా సామాజిక న్యాయంతో కూడిన కమిటీలను ప్రకటిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. 

Advertisement
Advertisement